గువ్వల బాలరాజు అరెస్ట్
గువ్వల బాలరాజు అరెస్ట్
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దీంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. తమ నాయకుడి అరెస్టు అక్రమమని, గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని, కావాలనే ఆయనను అరెస్టు చేయించిందని మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్కు తంగళ్లపల్లి జడ్పీటీసీ మంజుల దంపతుల రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టు ఇటీవల తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్కు మద్దతిస్తామని బాహాటంగానే ప్రకటించారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జడ్పీటీసీ పూర్మాణి మంజుల, జిల్లా క్రికెట్ అసోసియేసన్ అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త పూర్మాణి లింగారెడ్డి బీఆర్ఎస్కు టాటా చెప్పేశారు. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంజుల రెండుసార్లు తంగళ్లపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. రాజీనామా అనంతరం మంజుల దంపతులు మాట్లాడుతూ.. పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని, అందుకే రాజీనామా చేసినట్టు తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.