చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు
చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు
తెలుగుదేశం పార్టీ తాజాగా జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని... జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు.
-
వైఎస్ హయాంలో ఒకటిగా ఉన్న కుటుంబం జగన్ నిర్వాకంతో రెండుగా చీలిపోయిందన్న గంటా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విమర్శలు గుప్పించారు. మీ నాన్న గారి హయాంలో ఒకే మాట, ఒకే బాటగా ఉండే కుటుంబం తమరి నిర్వాకంతోనే రెండుగా చీలిపోయిందన్న లోగుట్టు ప్రపంచానికంతా తెలుసు జగనన్నా అని ఎద్దేవా చేశారు. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
మీరు జైల్లో ఉన్న సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన మీ తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని మీ కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు. మీ చెల్లికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని అడిగారు. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొడ్డని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు.
తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితమయిందని అన్నారు. మీరు పెట్టిన చిచ్చే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్నే చుట్టుముట్టబోతోందనే విషయాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారూ అని గంటా పేర్కొన్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారు. ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం... ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోందని అన్నారు. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసీపీపై పడుతుందని అన్నారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని జగనే చూసుకోవాలని అన్నారు.