క్రికెట్ లో కొత్త రూల్ .. ఐసీసీ
క్రికెట్ లో కొత్త రూల్ .. ఐసీసీ
స్టంప్ ఔట్ అప్పీల్ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్ తీసుకొచ్చింది. ఫీల్డ్ అంపైర్ నుంచి అప్పీల్ వస్తే కేవలం స్టంప్ ఔట్ ను మాత్రమే చెక్ చేసేలా నిబంధనలను మార్చింది. ఈ నిర్ణయం గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలులోకి వచ్చినట్లు తెలిపింది. ఐసీసీ తాజా నిర్ణయంతో బ్యాట్స్ మెన్ కు ప్రయోజనం కలగనుంది. డీఆర్ఎస్ మిస్ యూజ్ చేసే అవకాశంలేకుండా ఈ మార్పులు చేసినట్లు వివరించింది.
కీపర్ స్టంప్ ఔట్ కు అప్పీల్ చేసినపుడు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫరెన్స్ కోరుతుంటారు. ఈ అప్పీల్ ను పరిశీలించే క్రమంలో థర్డ్ అంపైర్ ముందు బంతి బ్యాట్ ను తాకిందా (క్యాచ్ ఔట్) లేదా అనేది చూస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ ను తాకితే క్యాచ్ ఔట్ ఇస్తారు. తాకకుంటే స్టంప్ ఔట్ అప్పీల్ ను పరిశీలిస్తారు. ఒక్క అప్పీల్ తో క్యాచ్, స్టంప్ ఔట్ లు రెండింటినీ పరిశీలించే అవకాశం కలుగుతోంది.
ఈ నిబంధనను ఉపయోగించుకుని ఫీల్డింగ్ జట్లు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే నిబంధనలలో మార్పులు చేస్తూ ఐసీసీ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. స్టంప్ ఔట్ అప్పీల్ వచ్చినపుడు కేవలం స్టంపింగ్ ను మాత్రమే పరిశీలించేలా రూల్స్ సవరించింది. క్యాచ్ ఔట్ కోసమైతే కీపర్ విడిగా అప్పీల్ చేసుకోవాలని ఐసీసీ పేర్కొంది.