రోహిత్, కోహ్లీలతో చర్చించాలనుకుంటున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
రోహిత్, కోహ్లీలతో చర్చించాలనుకుంటున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది జగరనున్న టీ20 వరల్డ్ కప్ ఆడతారా? లేదా? వారిద్దరికీ జట్టులో చోటు కల్పిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ప్రస్తుతానికైతే లేదు. కానీ వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్‌లో ఆడడం ఖాయమని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బయలుదేరి దక్షిణాఫ్రికా వెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. క్లారిటీ కోసం ఇరువురితోనూ చర్చించనున్నారని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్, ఆ వెంటనే ఐపీఎల్ ప్రారంభమవనుండడంతో ఈ లోగానే ఇద్దరి నుంచి క్లారిటీ తీసుకోవాలని అగార్కర్ భావిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కొత్త కెప్టెన్‌ను నియమించవచ్చని ఒక రిపోర్ట్ పేర్కొంది. ‘‘సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేరు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆటగాళ్లపై నిర్ణయానికి రాలేము. ఐపీఎల్ జరిగే మొదటి నెల ఆధారంగా ప్రతిదీ నిర్ణయించాల్సి ఉంటుంది’’ అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నట్టు మీడియా కథనాలు ప్రస్తావిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి ముందు ఐపీఎల్లో దాదాపు 25-30 మంది టీ20 స్పెషలిస్ట్ ఆటగాళ్లను బీసీసీఐ, సెలెక్టర్లు పరిశీలిస్తారని రిపోర్ట్ పేర్కొంది. కాగా కరేబియన్, అమెరికా వేదికగా జూన్ 4న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 30న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.
కాగా గత టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకోవడం కూడా ఒక కారణంగా ఉంది. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ టీమిండియా టార్గెట్‌గా ఉంది. దీంతో సీనియర్లు కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.