సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి
సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామన్న పొంగులేటి
సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. కార్మికులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి దినోత్సవం రోజును సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరపున కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీలు ఇచ్చారు.
పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రచారాన్ని నిర్వహిస్తూ... కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఐఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులను కోరారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: కొండా సురేఖ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను క్రమంగా అమలు చేస్తామని, ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలనలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ సుడిగాలి పర్యటన జరిపారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ జాతర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం వరంగల్లోని ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పర్యటన సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన ద్వారా పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలంతా వారి వారి డివిజన్లలో... వారి వారి గ్రామాల్లో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. వాటిని ఆన్ లైన్ చేసి... వెరిఫికేషన్ చేసి.. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.