తెరుచుకున్న ఉత్తర ద్వారం.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తెరుచుకున్న ఉత్తర ద్వారం.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఊరేగింపు నిర్వహించారు. స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా జరిగిన ఈ ఊరేగింపులో వేలాది భక్తులు పాల్గొన్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మరోవైపు, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తజనసంద్రంగా మారింది. ఆలయ వైకుంఠ ద్వారం తెరుచుకోవడంతో శనివారం స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
వేకువజామున 1:30 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని అర్చకులు తెరిచారు. శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ దర్శనానికి మొత్తం 4008 టోకెన్లు జారీ చేసినట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఉదయం 5:15 కు వీఐపీ బ్రేక్ దర్శనం ముగిశాయని, ఉదయం 6 గంటలకు ఎస్ఎస్ డి, ఎస్ఈడీ స్లాట్లను ఇచ్చామని చెప్పారు. సాధారణ భక్తులను 45 నిమిషాల ముందే వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించినట్లు వివరించారు.
భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశామని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రస్తుతం వెయిటింగ్ లేదని ఈవో ధర్మారెడ్డి వివరించారు. భక్తులు వేచి ఉండే పరిస్ధితి ఏర్పడితే అందరికీ ఆహార పదార్థాలు, కాఫీ, టీ, పాలు అందిస్తామని చెప్పారు. ఉచిత టోకెన్ల జారీ తిరుపతిలో నిరాటంకంగా జరుగుతోందని, రోజుకు 70 వేల నుంచి 75 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మొత్తం ఈ పది రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.