బుధవారం రాత్రి ముంబైలో ఆమిర్ ఖాన్ కూతురు వివాహం
బుధవారం రాత్రి ముంబైలో ఆమిర్ ఖాన్ కూతురు వివాహం
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ వివాహం బుధవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరెను ఇరా పెళ్లాడారు. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆమిర్ మొదటి భార్య రీనా దత్తాతో కలిగిన సంతానమే ఇరా ఖాన్. ఈ వివాహానికి ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తన కొడుకు ఆజాద్ తో కలిసి హాజరయ్యారు. వధూవరులతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు.
అనంతరం మాజీ భార్య కిరణ్ రావును పలకరించిన ఆమిర్ ఖాన్.. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దిచ్చారు. వరుడు నుపుర్ తల్లితో కలిసి అందరూ ఫొటోలకు పోజిచ్చారు. సినీ నిర్మాత కిరణ్ రావును ఆమిర్ పదిహేనేళ్ల క్రితం పెళ్లాడారు. 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే, కొడుకు ఆజాద్ పెంపకం బాధ్యతలను కలిసి పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా తరచూ మాజీ భార్యను, కొడుకును ఆమిర్ కలుస్తుంటారు.