అమృత్ భారత్ రైళ్లు.. పేదల కోసం ప్రత్యేకం..
అమృత్ భారత్ రైళ్లు.. పేదల కోసం ప్రత్యేకం..
ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఇండియన్ రైల్వే కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా డిసెంబర్ 30న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ డిసెంబర్ 30 ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
ప్రారంభంలో దేశంలో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడస్తుందని, రెండో ట్రైన్ దక్షిణ భారతదేశంలో నడుస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు.
ఇక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రత్యేకతల విషయానికొస్తే ఇందులో మొత్తం 22 బోగీలు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, రెండు గార్డు కంపార్ట్మెంట్లు ఉంటాయి. గార్డు కంపార్ట్మెంట్లలో విడిగా కోచ్లు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులైన ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. వేగం విషయానికొస్తే ఈ రైలు సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ రైలుకు ముందు, వెనక ఇంజన్లు ఉంటాయి. టికెట్ ధరలు, భవిష్యత్తులో ఏయే మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.