సైబరాబద్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ అవినాశ్ మహంతి
సైబరాబద్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ అవినాశ్ మహంతి
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ శనివారం విడుదల చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాఫ్తు కూడా కొనసాగుతోందని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో సిబ్బంది రెండు నెలలు సమర్థవంతంగా పని చేశారన్నారు.
కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4,850 ఉంటే... 2023లో 5,342 కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా, ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. ఆర్థిక, స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ సంవత్సరం మహిళలపై నేరాలు పెరిగినట్లు చెప్పారు. అత్యాచారాలు తగ్గినట్లు తెలిపారు. 2022లో 316 అత్యాచారాలు నమోదయితే ఈసారి 259 నమోదైనట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 52 వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు.
నూతన సంవత్సర వేడుకలపై స్పందిస్తూ... ఈ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.