తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా?
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో ఛైర్మన్ సహా ఐదుగురు సభ్యుల రాజీనామా విషయం ఎటూ తేలకపోవడంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలను జనవరి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ రెండు నెలల క్రితమే ప్రకటించింది. అయితే, ఈసారి కూడా పరీక్షలు జరగడం సందేహమేనని తెలుస్తోంది. పరీక్షలకు వారం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నా నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగకపోవడం ఈ సందేహానికి తావిస్తోంది.
పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో టీఎస్ పీఎస్సీ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ప్రభుత్వం మారడంతో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గవర్నర్ ఆమోదం లభిస్తే కానీ కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించే అవకాశం లేదు. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీలో ఇద్దరు సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సందిగ్ధంగా మారింది.
రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబర్ కు, మళ్లీ 2024 జనవరికి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.