రామనామీ: ఒళ్లంతా రామ నామాలే
రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?
ఛత్తీస్‌గఢ్‌లోని కస్‌డోల్‌కు చెందిన గులారామ్ రామనామీ ఇప్పుడు ‘బడే భజన్ మేళా’ కోసం సిద్ధమవుతున్నారు.
రామనామీ తెగ ఉనికిలోకి ఎలా వచ్చింది?
రామనామీల తెగలోని కొంత మంది పెద్దలు చెప్పినదాని ప్రకారం, ‘‘పరశురాం 19వ శతాబ్దం మధ్యకాలంలో జాంజ్గీర్-చంపా జిల్లాలోని చార్పారా గ్రామంలో జన్మించారు. తండ్రి నుంచి ప్రేరణ పొంది, రామ చరిత మానస్‌ను చదవడం నేర్చుకున్నారు. 30 ఏళ్ల వయసులో చర్మ సంబంధిత వ్యాధి బారిన పడ్డారు.
అదే సమయంలో రామనంది సాధు రామ్‌దేవ్‌ను కలుసుకున్నాక, అతడి ఛాతీపై రామ్-రామ్ అని రామనామంతో పచ్చబొట్టు ప్రత్యక్షమైంది. అప్పుడే ఆ చర్మ వ్యాధి కూడా తగ్గిపోయింది. ఆ తరువాతి నుంచి రామ్-రామ్ అంటూ రామనామాన్ని స్మరించడం మొదలుపెట్టారు పరశురాం.’’
ఆయనిచ్చిన ప్రేరణతో, అక్కడి గ్రామంలోని ప్రజలంతా వారి నుదుటిపై ‘రామ్-రామ్’ అని పచ్చబొట్లు వేయించుకున్నారని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆ గ్రామస్థులంతా ఖాళీ సమయాల్లో రామనామాన్ని స్మరించడం కొనసాగించారని చెప్తారు.
ఇతర సాధువుల్లానే వారు కూడా మాంసాహారం, మత్తుపానీయాలు మానేసి, శాకాహారం మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అలా 1870ల కాలంలో రామనామీల తెగ ఉనికిలోకి వచ్చింది.
రామనామీలు వారు ధరించే దుస్తులపై కూడా రామనామాన్ని రాయడం మొదలుపెట్టారు. అలా వారికి సంబంధించిన ఏ విషయమైనా, వారి జీవన విధానమైనా రామనామంతో నిండిపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో నివసించే రామనామీలు శరీరమంతటా రామ నామాన్నే శాశ్వతమైన పచ్చబొట్లుగా రాయించుకుంటారు.
సుమారు వందేళ్లుగా ఏటా మహానది తీరాన ‘బడే భజన్ మేళా’ నిర్వహిస్తున్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ మేళాలో వేల మంది ఒకే చోట చేరి, రామచరిత మానస్ గురించి, రామ నామం గురించి భజన చేస్తారు. గీతాలాపన చేస్తారు.
ఈ సారి జనవరి 21 నుంచి 23 మధ్య బడే భజన్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
గులారామ్ రామనామీ మాట్లాడుతూ, “మూడు రోజులపాటు వేల మంది రామనామీలు వేర్వేరుగా, బృందాలుగా రామాయణంలోని కీర్తనలు ఆలపించి, రామాయణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన నిర్వహిస్తారు. ఈసారి మేం మేళా నిర్వహించే సమయానికి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతోంది” అన్నారు.
రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగకు చెందిన వారు గులారామ్.
‘నఖశిఖ’ పర్యంతం అంటే తల మొదలుకొని కాలిగోరు వరకు శరీరంపై రామ నామాన్ని పచ్చబొట్లుగా వేయించుకుంటారు వీరు.
ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ మొదలవుతుంది. అక్కడి నుంచి రోజంతా, ఏ పని చేసినా, రామనామాన్ని స్మరించాల్సిందే.
విగ్రహారాధనను విశ్వసించని రామనామీ తెగలోని ప్రజలు నిర్గుణ రాముడి రూపాన్ని భజనల రూపంలో, రామచరిత్ మానస్‌లోని పద్యాలను ఆలపిస్తూ ఆరాధిస్తారు.