‘భారత్ జీపీటీ’ కోసం ఐఐటీ బాంబేతో జట్టుకట్టిన జియో
‘భారత్ జీపీటీ’ కోసం ఐఐటీ బాంబేతో జట్టుకట్టిన జియో
చాట్ జీపీటీలా రిలయన్స్ జియో నుంచి ‘భారత్ జీపీటీ’ రాబోతోంది. ఇందుకోసం ఐఐటీ బాంబేతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఇండియా కోసం ప్రత్యేకంగా అతిపెద్ద భాషా మోడల్‌గా ఇది రూపుదిద్దుకోనుంది. ఐఐటీ బాంబే వార్షిక టెక్‌ఫెస్ట్ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ మేరకు ప్రకటించారు.
రిలయన్స్తోపాటు వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ)ని ఏకీకృతం చేయబోతున్నట్టు పేర్కొన్నారు. వచ్చే దశాబ్దంలో ఇది అతిపెద్ద భాషా మోడల్ కానుందని వివరించారు. ఏఐని జియో సంస్థలతోపాటు మీడియా, కామర్స్, కమ్యూనికేషన్, డివైజ్ పరికరాలతో సహా విభిన్న రంగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తున్న జియో ఈ డొమైన్లలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు, టెలివిజన్ల కోసం సొంత ఆపరేటింగ్ వ్యవస్థను ప్రారంభించాలని జియో యోచిస్తోంది. ఇందుకోసం చురుగ్గా పనిచేస్తోంది. దీనిని మార్కెట్లోకి ఎలా ప్రవేశపెట్టాలన్న దానిపై ఆలోచిస్తున్నట్టు అంబానీ పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానప్పటికీ, ఈ ఓఎస్ ‘జియో2.0’ అయి ఉంటుందని మాత్రం తెలుస్తోంది. జియో తన సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు, కొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతోందన్న విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది.