మేడిగడ్డ పియర్స్ , అన్నారం బ్యారేజీలో సీపేజీ వాటి పునరుద్ధరణ తమ వల్ల కాదన్న సీడీవో
మేడిగడ్డ పియర్స్ , అన్నారం బ్యారేజీలో సీపేజీ వాటి పునరుద్ధరణ తమ వల్ల కాదన్న సీడీవో
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ తమ వల్ల కాదని, మరెవరినైనా చూసుకోవాలని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) స్పష్టం చేసింది. ఇటీవల మేడిగడ్డ పియర్స్ కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీలో సీపేజీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీటికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సీడీవో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిర్మాణ సమయంలోని మోడల్ స్టడీస్‌కు, బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేదని, అందుకనే ఈ సమస్య తలెత్తిందని సీడీవో అభిప్రాయపడినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చింది సీడీవోనే.
అయితే, ఇప్పుడు దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించిన నైపుణ్యం తమ వద్ద లేదంటూ చేతులెత్తేసింది. అత్యాధునిక సామర్థ్యం ఉండి, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి బ్యారేజీల రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోవాలని సూచించింది.
రేపు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రేపు (29 డిసెంబర్) మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వారు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజ్ వద్ద అధికారులు... మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం కోసం అవసరమైన విద్యుత్.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ సమస్యలు.. వాటి పరిష్కారాలపై ప్రజెంటేషన్ సందర్భంగా మంత్రులకు వివరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లాభాలను... అలాగే నష్టాలనూ అధికారులు వివరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ రేపటి సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీకి ఇప్పటికే మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు కూడా పాల్గొననున్నాయి.