బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని కోమటిరెడ్డి ఆరోపణ
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని కోమటిరెడ్డి ఆరోపణ
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో కోమటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ కనీసం ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు తవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు అని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కల్లిబొల్లి మాటలు చెప్పారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు.