మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ చెబుతోందా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్న
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ చెబుతోందా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్న
ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నా చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ బోలక్‌పూర్‌లో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... తాము అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని వెల్లడించారు.
అలాగే అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఎందుకు ధర్నా చేయిస్తోంది? అని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారా? అని నిలదీశారు. ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
వరంగల్‌లో బీఆర్ఎస్కు భారీ షాక్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోంది. వరంగల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు కొండా సురేఖ, కొండా మురళితో టచ్ లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నలుగురు గెలిచారు. ఇప్పుడు సగానికి పైగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతున్నారు.