టోవినో థామస్ నట విశ్వరూపమే 'అదృశ్య జలకంగల్' ..
టోవినో థామస్ నట విశ్వరూపమే 'అదృశ్య జలకంగల్' ..
ఈ ఏడాది మలయాళంలో ప్రశంసలు అందుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా 'అదృశ్య జలకంగల్' కనిపిస్తుంది. టోవినో థామస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, బిజూ కుమార్ దామోదరన్ దర్శకత్వం వహించాడు. నిమిషా సజయన్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడం విశేషం.
రీసెంటుగా ఈ సినిమా మలయాళ వెర్షన్ 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా రానుంది. టోవినో థామస్ గొప్ప నటుడని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఈ సినిమాలో టోవినో పాత్రకి పేరు ఉండదు. అతను మానసిక స్థితి సరిగ్గా లేని అమాయకుడు. ఊరికి దూరంగా ఉన్న ఓ పాడుబడిన రైల్వే బోగీనే ఆయన నివాస స్థానం. శవాగారంలో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తూ, కాలం గడుపుతూ ఉంటాడు.
ఆ నిర్జన ప్రాంతంలో దూరంగా ఒక ఫ్యాక్టరీలో ఏవో తయారవుతూ ఉంటాయి. ఫ్యాక్టరీలో యూనిఫామ్ ధరించినవారి హడావిడి ... నిరంతరం పైన హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం అతను రహస్యంగా గమనిస్తూ ఉంటాడు. అతనిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి కొంతమంది ట్రై చేస్తారు. అప్పుడు అతను ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే .. అది టోవినో నటన అనే చెప్పాలి. నల్లని మేకప్ ... నలిగిన బట్టలు .. చెదిరిన జుట్టుతో కనిపిస్తాడు. దవడలు చిత్రంగా కదిలిస్తూ ఉంటాడు. అతని నడక .. పరుగు చూస్తే, ఆ పాత్రను అతను ఎంతగా అర్థం చేసుకున్నాడనేది మనకి అర్థమవుతుంది.