నాగ్ పూర్ - అమరావతి హైవేపై ప్రమాదం..తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ఇచ్చి పంపిన సీఎం షిండే
నాగ్ పూర్ - అమరావతి హైవేపై ప్రమాదం..తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ఇచ్చి పంపిన సీఎం షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తన కాన్వాయ్ ఆపి రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేశారు. బాధితులను తన కాన్వాయ్ లోని అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించారు. వారిని చేర్చుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఫోన్ లో సూచించారు. దీంతో బాధిత యువకుడికి ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి బాధిత యువకుడి ఆరోగ్య పరిస్థితిని సీఎం షిండే అడిగి తెలుసుకున్నారు.
నాగ్ పూర్ - అమరావతి హైవేపై గోండ్ ఖైరి బస్ స్టాప్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఓ బైక్ డీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న యువకుడు ట్రక్కు బంపర్ కింద ఇరుక్కుపోయాడు. అదే సమయంలో వెనకే స్పీడ్ గా వస్తున్న కారు కూడా ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ రూట్ లో సీఎం ఏక్ నాథ్ షిండే ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి సీఎం షిండే తన కాన్వాయ్ ను ఆపి కిందకి దిగారు.
బాధిత యువకుడిని నాగ్ పూర్ తరలించేందుకు తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ను పంపించారు. ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారులో ఉన్న పలువురికి గాయాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి పంపించారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లిన షిండే.. బాధిత యువకుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన వెంటనే బాధిత యువకుడిని ఐసీయూలో చేర్చి, చికిత్స చేశామని, ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.