హెజ్బొల్లాపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత
హెజ్బొల్లాపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత
గాజాలోకి ప్రవేశించి హమాస్‌ను నామరూపాల్లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఊహించని విపత్తు వచ్చి పడింది. హమాస్‌కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ.. ఇజ్రాయెల్ శత్రుదర్భేద్యమైన ఐరోన్డోమ్పై దాడిచేసి దానికి తీవ్ర నష్టం కలగజేసింది. ఐరన్‌డోమ్ అనేది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దీనిని ఏమార్చడం ద్వారానే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు తెగబడింది. ఇప్పుడు దానినే లక్ష్యంగా చేసుకున్న హెచ్‌బొల్లా దానిని చాలా వరకు దెబ్బతీసి మరో భారీ షాకిచ్చింది.
ఇజ్రాయెల్ ఉత్తరప్రాంతంలోని కబ్రిలో రెండు ఐరన్‌డోమ్ వ్యవస్థలపై దాడిచేసి నష్టం కలిగించినట్టు హెచ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయమై ఇంకా స్పందించలేదు. అయితే, హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఆ రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది.