విజయకాంత్ తమిళ రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేశారు .. మోదీ
విజయకాంత్ తమిళ రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేశారు .. మోదీ
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. తమిళ చలనచిత్ర ప్రపంచంలో విజయకాంత్ ఒక లెజెండ్ అని చెప్పారు. తన విలక్షణమైన అభినయంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారని, తమిళనాడు రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తనకు విజయకాంత్ సన్నిహిత మిత్రుడని, ఆయనతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని చెప్పారు. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.
- విజయకాంత్ మృతికి విష్ణు సంతాపం
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతికి టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. కెప్టెన్గా చిరపరిచితుడైన విజయకాంత్ మృతి బాధించిందన్నారు. తన బాల్యం నుంచే ఆయన సినిమాలు తన జీవితంలో భాగంగా మారాయని గుర్తు చేసుకున్నారు. ఆయన పంచిన జ్ఞానాన్ని తానెప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. తామెప్పుడు కలిసినా ఇష్టంగా మాట్లాడేవారని, చిత్ర పరిశ్రమలో నిజమైన నాయకుడు ఆయనేనని ప్రశంసించారు. ‘వీడ్కోలు కెప్టెన్’ అని విష్ణు ఎక్స్ చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్త కోలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.