రాజీనామా లేఖను జగన్ కు పంపిన దాడి వీరభద్రరావు
రాజీనామా లేఖను జగన్ కు పంపిన దాడి వీరభద్రరావు
ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు కూడా రాజీనామా పత్రాలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. మరోవైపు మీడియాతో ఆయన మాట్లాడుతూ... త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెపుతానని అన్నారు.
ఉమ్మడి ఏపీలో టీడీపీలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహరించారు. నాలుగు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు మందు మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు, వైసీపీకి మరోసారి రాజీనామా చేశారు.
టీడీపీ గూటికి తిరిగి రానున్న దాడి వీరభద్రరావు!
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై చెప్పడం తెలిసిందే. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు జైవీర్, రత్నాకర్ కూడా వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో, దాడి వీరభద్రరావు రాజకీయ పయనం ఎటు అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే, ఆయన టీడీపీ గూటికి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ లతో భేటీ కానున్నట్టు సమాచారం. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నాయని కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దాడి వీరభద్రరావు 2014 ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. 2019లో ఆయన వైసీపీలో చేరారు. అనకాపల్లి నుంచి పోటీ చేయాలని దాడి వీరభద్రరావు భావించినప్పటికీ, ఆయనకు వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడాయన రాజీనామాతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.