బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చేయాలంటూ ఆదేశం
బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చేయాలంటూ ఆదేశం
పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని సూచించారు. పార్టీ ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హిప్ రిప్లేస్ మెంట్ చికిత్స చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా, పార్లమెంట్ లో సోమవారం 93 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా.. మంగళవారం మరో 50 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో సభలు సజావుగా సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫున సభలలో వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీలకు సూచనలు చేస్తారని సమాచారం.
నాపై నమోదైన అక్రమ కేసు కొట్టివేయండి: హైకోర్టులో మల్లారెడ్డి
పిటిషన్
భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు అక్రమమని, దీనిని కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. జస్టిస్ సురేందర్ ముందుకు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. అయితే రాజకీయ నాయకుల కేసులను విచారించే బెంచ్ ముందుకు ఈ పిటిషన్‌ను తీసుకెళ్లాలంటూ రిజిస్ట్రీని జడ్జి ఆదేశించి, కేసు విచారణను వాయిదా వేశారు.
కాగా మేడ్చల్ మండలం మూడుచింతపల్లి మండలం కేశవాపురం గ్రామంలో భూములను కబ్జా చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది అక్రమ కేసు అని మల్లారెడ్డి చెబుతున్నారు.