అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టిన బీఆర్ఎస్
అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టిన బీఆర్ఎస్
తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తొమ్మిదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రభుత్వాని కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతి, మాజీ కేసీఆర్ సృష్టించిన ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ఇందులో పేర్కొంది. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్ లో వివరించింది.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పులపాలైందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలోనూ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పలుమార్లు ఇవే ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఈ నెల 20 (బుధవారం) న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దీనికోసం ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మొత్తం 20 మంది సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని ఆర్థిక రంగ నిపుణులు, ప్రస్తుత, రిటైర్డ్ ప్రొఫెసర్లు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం తయారు చేశారు.
మేం కూడా ఇస్తాం పవర్ పాయింట్ ప్రజంటేషన్.. స్పీకర్‌ను అనుమతి కోరిన
హరీశ్‌రావు
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతోపాటు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సవివరంగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందుకు రెడీ అవుతోంది. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం స్పీకర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో తమ వెర్షన్ కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.