దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో నలుగురి మృతి
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో నలుగురి మృతి
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది. మొన్న 350.. నిన్న 640.. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది.
వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.