సజ్జల ఒక గాడిద అంటూ బుచ్చయ్య తీవ్ర వ్యాఖ్యలు
సజ్జల ఒక గాడిద అంటూ బుచ్చయ్య తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గాడిద అంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలను జైలుకు పంపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన వైఫల్యాలను మంత్రులు, ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్నారని విమర్శించారు. చివరకు మంత్రులకు కూడా స్థాన చలనం చేస్తున్నారని అన్నారు. రామచంద్రపురంలో పని చేయని మంత్రి రాజమండ్రి రూరల్ లో పని చేస్తాడా? అని ప్రశ్నించారు. అవినీతిపరుడైన ఒక వ్యక్తి మరోచోట మంచోడైపోతాడా? అని అన్నారు.
ఏసుక్రీస్తు గెటప్ లో జగన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దుర్మార్గుడైన జగన్ కు ఏసుక్రీస్తుతో పోలికా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అని, చేతకాని దద్దమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం అయిందని చెప్పారు. రాష్ట్రమంతా తిరిగి లోకేశ్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. జగన్ ను ఇంటికి పంపించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.
ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు సరిగ్గా అమలు
కావడంలేదు: గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈసీ ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఓటర్ల లిస్ట్‌ను పారదర్శకంగా రూపొందించే విషయంలో అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై లోక్‌సభలో చర్చలో జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓటర్ల లిస్టులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, దొంగ ఓట్లు నమోదవుతున్నాయని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ ప్రధాన విధి అని, కానీ ఆంధ్రప్రదేశ్ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష టీడీపీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల పేర్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే.