వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 లోపు సీట్లే వస్తాయి .. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 లోపు సీట్లే వస్తాయి .. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సుమారు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన అభ్యర్థులు లేరని భావించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించే స్థాయికి చేరబోతోందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన క్రైస్తవులు ఇక షర్మిల వైపు చూస్తారని విశ్లేషించారు. షర్మిల భర్త అనిల్ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్నారని, గతంలో ఆయన తన తన బావ జగన్ గెలుపు కోసం కృషి చేశారని ప్రస్తావించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు, ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినా అతిశయోక్తిలేదన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల నిర్ణయం తీసుకోవడం వైసీపీకి ఒక పెద్ద ప్రమాదం లాంటి పరిణామమని వ్యాఖ్యానించారు. వైకాపాలో టికెట్ దక్కని నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీచేస్తారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న తర్వాత వైసీపీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. ‘‘ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీకి 30-35 స్థానాలు వస్తాయని గతంలో నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 20 లోపే ఉంటుంది’’ అని రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైకాపాకు ఇప్పటివరకు దన్నుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్‌వైపు మళ్లనున్నాయి. సీఎం జగన్‌ను భరించే నాయకులు, ప్రజలు రాష్ట్రంలో ఎవరూ లేదని విమర్శించారు. అన్ని వర్గాల ఆగ్రహావేశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాయని అభిప్రాయపడ్డారు.
నేడు టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..
సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు కుమారులతో కలిసి ఆయన తన సొంత గూడు టీడీపీలోకి చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈరోజు చంద్రబాబును ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా తన కుమారులు, అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 2014 వరకు దాడి వీరభద్రరావు టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు దాడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు పక్షాన చేరిన తర్వాత ఆయన పార్టీలో కీలక పాత్రను పోషించారు. ఈ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీని వీడారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.