కొడుకు, కుమార్తె ఉన్నత విద్యా పట్టాలు..ఫొటోలు పంచుకున్న షర్మిల
కొడుకు, కుమార్తె ఉన్నత విద్యా పట్టాలు..ఫొటోలు పంచుకున్న షర్మిల
పిల్లలు ప్రయోజకులైతే అత్యధికంగా సంతోషించేది తల్లిదండ్రులే. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతులు కూడా తమ బిడ్డలు ఉన్నత విద్య పట్టాలు అందుకున్న నేపథ్యంలో, ఆనందంతో పొంగిపోతున్నారు. దీనికి సంబంధించి షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.
"మా ఇద్దరు పిల్లలు చదువులో కీలక మైలురాళ్లు అందుకున్నారు. నా కుమారుడు రాజారెడ్డి అప్లయిడ్ ఎకనామిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ సబ్జెక్టులతో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పుచ్చుకున్నాడు. మా అమ్మాయి అంజలీ రెడ్డి బీబీఐ ఫైనాన్స్ డిగ్రీ పట్టా అందుకుంది" అని వివరించారు.
"పిల్లలూ... మీరప్పుడే ఎంత పెద్దవాళ్లయిపోయారు! మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. సత్యాన్వేషణ కోసం మీరు స్వచ్ఛమైన హృదయాలతో, ధైర్యంగా ప్రపంచంలోకి అడుగుపెట్టండి. సాటి మనుషుల పట్ల ఆదరణ మరువవద్దు. మీరు ఎదగడమే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా విలువ ఇవ్వండి... వారికి కూడా ఎదిగే మార్గం చూపించండి. మీకు మంచి జరిగితే అది ఇతరులకు కూడా శుభప్రదం కావాలి" అంటూ షర్మిల తన కొడుకు, కుమార్తెకు సందేశం అందించారు. ఈ మేరకు తన బిడ్డలతో కలిసున్న ఫొటోలను పంచుకున్నారు.
కాగా, షర్మిల పంచుకున్న ఫొటోల్లో తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు.