లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన క్రిష్ ... అనుష్కతో జరుగుతున్న సంప్రదింపులు
లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన క్రిష్ ... అనుష్కతో జరుగుతున్న సంప్రదింపులు
క్రిష్ నుంచి ఈ మధ్య కాలంలో సినిమా రాలేదు. అందుకు కారణం ఆయన పాన్ ఇండియా స్థాయిలో 'హరి హర వీరమల్లు' సినిమాను ప్లాన్ చేసుకోవడం .. అది ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవడం. ఈ సినిమా షూటింగు గ్యాపులోనే క్రిష్ 'కొండపొలం' సినిమా చేశాడు. ఆ తరువాత కూడా 'వీరమల్లు' విషయంలో పెద్దగా మార్పులేమీ జరగలేదు.
ఈ నేపథ్యంలోనే తన సారథ్యంలో క్రిష్ 'కన్యా శుల్కం' వెబ్ సిరీస్ ను పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆ తరువాత కూడా ఆయన మరో ప్రాజెక్టుపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఒక లేడీ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథకు అనుష్క అయితే కరెక్టుగా ఉంటుందని భావించినట్టుగా సమాచారం.
గతంలో క్రిష్ చేసిన 'వేదం' సినిమాలోని పాత్ర అనుష్కకి మంచి పేరును తెచ్చిపెట్టింది. అందువలన ఆమెతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే అనుష్క 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా చేసిందిగానీ అది సరిగ్గా ఆడలేదు. సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన అనుష్క, క్రిష్ మూవీ చేయడానికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది చూడాలి.