'కీడా కోలా' ఈ నెల 29వ తేదీ నుంచి 'ఆహా' స్ట్రీమింగ్
'కీడా కోలా' ఈ నెల 29వ తేదీ నుంచి 'ఆహా' స్ట్రీమింగ్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'కీడా కోలా'. నవంబర్ 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కామెడీని టచ్ చేస్తూ సాగే క్రైమ్ థ్రిల్లర్. తరుణ్ భాస్కర్ - చైతన్య రావు - రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు.
తరుణ్ భాస్కర్ గతంలో చేసిన సినిమాల కారణంగా, ఈ సినిమాపై యూత్ ఆసక్తిని కనబరిచారు. థియేటర్ల దగ్గర సందడి చేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.
ముగ్గురు స్నేహితులు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ పరిస్థితి నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచన చేస్తుంటారు. ఆ సమయంలోనే తాము తాగే కూల్ డ్రింక్ బాటిల్ లో బొద్దింక ఉండటం చూసి, యజమానిని బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తారు. పర్యవసానంగా ఏం జరుగుతుందనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.