రోజాకు బ్యాటింగ్ నేర్పించిన సీఎం జగన్...
రోజాకు బ్యాటింగ్ నేర్పించిన సీఎం జగన్...
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. బ్యాట్ చేతపట్టిన ఆయన కొన్ని బంతులను ఎదుర్కొన్నారు. భారీ షాట్లతో అలరించారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రి రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించారు. బ్యాటింగ్ చేయడానికి జంకుతున్న రోజాను ఆయన ప్రోత్సహించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి? గ్రిప్ పొజిషన్ ఎలా ఉండాలి? స్టాన్స్ ఎలా ఉండాలి? అనే అంశాలను సీఎం జగన్ వివరించారు. ఓ దశలో రోజా బ్యాట్ ను సరిగా పట్టుకోలేకపోవడంతో, ఓసారి తాను బ్యాట్ అందుకుని బ్యాటింగ్ పొజిషన్ ను ఆమెకు చూపించారు.
ఎట్టకేలకు రోజా ఓ బంతిని ఆడగా, సీఎం జగన్ చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, సీఎం జగన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు.