రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామన్న సీపీఐ నేత
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామన్న సీపీఐ నేత
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీపీఐకి ఒక సీటును కేటాయించాలని తాము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మిక సంఘాలలో తాము బలంగా ఉన్నామని తెలిపారు. కానీ ఆ బలానికి అనుకూలంగా ఓటు మాత్రం రావడం లేదని వాపోయారు. పార్టీని మరింతగా పెంచుకోవాలన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని... ఆ పార్టీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భాగంగా తమకు ఒక సీటును కేటాయించాలని కోరారు. తాము నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాలలో ఒకదానిని అడుగుతున్నామన్నారు. ఈ నియోజకవర్గాలలో తమకు మంచి బలం ఉందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై కూనంనేని స్పందిస్తూ... ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. వివిధ అంశాలపై ఆరు నెలల గడువు ఇచ్చి తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తాము ఎంతో చేసినట్లుగా చెబుతోందని... కానీ పేపర్ వర్క్ తప్ప ప్రాక్టికల్‌గా ఏమీ కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం నెల రోజులు కూడా కాలేదని.. కానీ బీఆర్ఎస్ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న చందంగా మాట్లాడుతోందన్నారు. అధికార మార్పిడిని బీఆర్ఎస్ జీర్ణించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని అంగీకరించలేకపోతోందని విమర్శించారు.