మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపు
మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపు
ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని విమర్శించారు. నేటి నుంచి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.
‘‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నాను’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఏపీలో వాలంటీర్ల నిరసన బాట.. నేటి నుంచి సమ్మె
ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు సోమవారం సాయంత్రం వరకూ తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం సమ్మె సైరన్ మోగించేందుకు వాలంటీర్లు డిసైడయ్యారు.
2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వాలంటీరుకు రూ.5 వేలు గౌరవవేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే, గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్లకు రూ. 750 జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే