మాంజాతో గొంతు తెగి పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం
మాంజాతో గొంతు తెగి పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం
గాలిపటం దారానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. ముంబైకి చెందిన ఓ కానిస్టేబుల్ మెడకు మాంజా చుట్టుకోవడంతో దుర్మరణం చెందాడు. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సమీర్ జాదవ్ దిన్‌దోషీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వకోలా వంతెన వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని సియాన్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఖేర్వాదీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యాక్సిడెంట్ లో బంధువు చనిపోయిన స్పాట్ కు వెళుతుండగా ప్రమాదం..
నలుగురి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు చనిపోయాడని తెలిసి ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా.. చావుబతుకుల్లో ఉన్న మరో ముగ్గురిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమ్మనూరులోని వేంపాడు దగ్గర్లో సైదులు అనే పెద్దాయనను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు, కేశవులు ఇద్దరూ చనిపోయారు. కేశవులు మృతి వార్త తెలిసి ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ప్రమాదం జరిగిన చోటుకు టాటా ఏస్ వాహనంలో కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు బయలుదేరారు.
ఇంకో ఐదు పది నిమిషాలు ప్రయాణిస్తే ఘటనా స్థలికి చేరుకుంటామనగా.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వీరి టాటా ఏస్ ను ఢీ కొట్టింది. దీంతో కేశవులు కుటుంబ సభ్యులు రమావత్ గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు.