ఫ్రాన్స్ లో ఎయిర్ బస్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ .. 700 మంది ఉద్యోగులకు అస్వస్థత
ఫ్రాన్స్ లో ఎయిర్ బస్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ .. 700 మంది ఉద్యోగులకు అస్వస్థత
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఫ్రాన్స్ లో డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ఓ విందు కార్యక్రమం వికటించింది. ఇప్పుడు దీనిపై విచారణకు ఆదేశించారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్ లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు.
కంపెనీ ప్రాంగణంలోనే ఉన్న ఓ రెస్టారెంటులో ఏర్పాటు చేసిన ఈ విందులో దాదాపు 2,600 మంది పాల్గొన్నారు. అనేక రకాల నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు.
అయితే, విందు ఆరగించిన వారిలో 700 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందన్నది ఇంకా అంతుబట్టకుండా ఉంది. దాంతో, ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
ఎయిర్ బస్ అట్లాంటిక్ సంస్థ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. కాగా, పార్టీలో వడ్డించిన ఆహార పదార్థాలను ఎయిర్ బస్ కంపెనీ క్యాంటీన్ లోనే వండినట్టు వర్క్స్ కమిటీ కార్యదర్శి జీన్ క్లాడ్ ఇరిబారెన్ వెల్లడించారు.
పంజా విసురుతున్న కరోనా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా... 70 లక్షల మంది మరణించారని తెలిపింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించేందుకు యత్నించాలని చెప్పింది.