నమ్మిన వారిని మోసం చేయడం జగన్ నైజO .. ఆనందబాబు
నమ్మిన వారిని మోసం చేయడం జగన్ నైజO .. ఆనందబాబు
నమ్మిన వారిని నిలువునా మోసగించడం ముఖ్యమంత్రి జగన్ నైజమని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. కేవీపీ రామచంద్రరావు, సూరీడు కనుమరుగు కావడానికి కూడా జగన్ కారణమని చెప్పారు.. జగన్ ను నమ్ముకుని టీడీపీ నేతలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కేసులు వేశారని... ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో అందరం చూస్తున్నామని అన్నారు. తల్లిని, చెల్లిని కూడా మోసగించిన చరిత్ర జగన్ దని... జగన్ వదిలిన బాణం చివరకు ఆయనకే గుచ్చుకోబోతోందని చెప్పారు. షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం టీడీపీకి లేదని... ఆమెను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా చేయబోమని అన్నారు. జగన్ రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలే ఇప్పుడు తమ మేలు కోరుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవాలని చెప్పారు.
టీడీపీ గెలవడం ఖాయం కాబట్టే తమ వద్దకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చారని ఆనందబాబు అన్నారు. దేశానికి సరిహద్దులు ఉంటాయి కానీ... జగన్ అవినీతికి సరిహద్దులు లేవని చెప్పారు. జగన్ అవినీతి కారణంగా గతంలో ఐఏఎస్ అధికారులు మాత్రమే జైలుకు వెళ్లారని... ఈసారి ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లు కూడా వెళ్తారని అన్నారు. తన తండ్రి మృతికి రిలయన్స్ వాళ్లు కారణమంటూ ఆ సంస్థ దాడులు చేయించిన చరిత్ర జగన్ దని విమర్శించారు.
వై నాట్ పులివెందుల?: దేవినేని ఉమా
ఓవైపు 'వైనాట్ 175?' అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో 'వైనాట్ పులివెందుల?' అని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ.... వైనాట్ పులివెందుల? అంటూ టీడీపీ నినదిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 2023న సింహాద్రిపురంలో చంద్రబాబు పర్యటన, అదే ఊరిలో ఈ నెలలో జరిగిన జగన్ పర్యటన వీడియోలను ఆయన షేర్ చేశారు. 'జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జన నీరాజనం. జగన్ వస్తే పత్తా లేని జనం. జగన్ పని అయిపోయింది' అని ఆయన ఎద్దేవా చేశారు.