తమిళనాడులో రాత్రంతా వర్షం, నాలుగు జిల్లాలు అతలాకుతలం..
తమిళనాడులో రాత్రంతా వర్షం, నాలుగు జిల్లాలు అతలాకుతలం..
కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది. ఫలితంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకు విస్తరించి ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
కుండపోత వర్షం కారణంగా పైన పేర్కొన్న నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది. అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు.