చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిశోర్
చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిశోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ చేరుకున్నారు. వారిరువురు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కాగా, చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. 'షో టైమ్ కన్సల్టెన్సీ' పేరిట రాబిన్ శర్మ టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. లోకేశ్, ప్రశాంత్ కిశోర్ కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ రావడంతోనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
- ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన లోకేశ్, ప్రశాంత్ కిశోర్
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం అనదగ్గ ఘటన నేడు చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఇద్దరూ ఒకే వాహనంలో వెళ్లారు. ప్రశాంత్ కిశోర్ కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాబోయే ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినాయకత్వంతో భేటీ అవుతుండడం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం కోసమేనని తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ... ప్రశాంత్ కిశోర్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటుందా? అన్నది వేచిచూడాలి.