గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులకు పాల్పడుతున్నది. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని కచ్చితంగా విడిపించుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లను నామ రూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించింది. అదేవిధంగా, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 24 గంటల్లో 200 మంది వరకు చనిపోయారని హమాస్ ఆదివారం ప్రకటించింది.
నార్త్ గాజాలోని జబాలియా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిందని పాలస్తీనియన్లు తెలిపారు. శనివారం రెండు ఇండ్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 90 మంది పాలస్తీనియన్లు చనిపోయారని రెస్క్యూ, హాస్పిటల్ సిబ్బంది వివరించింది. రెసిడెన్షియల్ ఏరియాలు, టన్నెల్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్నదని హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి దాకా 20వేల మంది చనిపోయారు. గాజాలోని 23 లక్షల జనాభాలో 85శాతం మంది నిరాశ్రయులయ్యారు.
అంతర్జాతీయ ఒత్తిడిని లెక్కచేయని బెంజమిన్
కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతున్నా.. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 152 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో 13 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు.
వీరిలో నలుగురు యాంటీ ట్యాంక్ మిసైల్ వెహికల్‌పై జరిగిన దాడి ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఆపాలంటూ టెల్ అవీవ్‌లో వేలాది మంది ఇజ్రాయెలీలు ప్రధానిని కోరారు. దీనిపై బెంజమిన్ స్పందిస్తూ..‘‘యుద్ధం ముగియనివ్వండి.. మీరు అడిగిన ప్రతి కఠినమైన ప్రశ్నకు సమాధానం ఇస్తాను”అని అన్నారు. నార్త్, సౌత్ గాజాలో దాడులు తీవ్రతరం చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ ఏరియాల్లోనే హమాస్ మిలిటెంట్లు దాక్కున్నట్లు తెలిసిందని వివరించింది.