ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల కార్గో ధరలు రెట్టింపు
ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల కార్గో ధరలు రెట్టింపు
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో యూరప్ నుంచి ఆసియాకు రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై ఇరాన్ సపోర్ట్ ఉన్న హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ అటాక్స్ చేస్తుండటంతో వందలాది కార్గో షిప్పులను దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం యూరప్ నుంచి ఇండియా సహా ఆసియా దేశాలకు వెళ్లే షిప్పులకు ఎర్రసముద్రం ద్వారానే షార్ట్ కట్ రూట్ ఉన్నది. యూరప్ నుంచి మధ్యధరా సముద్రం గుండా ఈజిప్టులోని సూయజ్ కెనాల్‌ను దాటి.. గల్ఫ్‌లోని ఎర్ర సముద్రం గుండా అరేబియా సముద్రం, ఇండియన్ ఓషియన్ మీదుగా ఆసియాకు షిప్పులు వెళ్తున్నాయి.
కానీ ఎర్రసముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై యెమెన్ నుంచి.. అరేబియా సముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై ఇరాన్ నుంచి హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు చేస్తున్నారు. హౌతీలకు ఇరాన్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా హౌతీలు దాడులు పెంచారు. దీంతో అనేక షిప్పింగ్ కంపెనీలు తమ కార్గో షిప్పులను యూరప్ నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి ఇండియన్ ఓషన్ మీదుగా ఇండియాకు, ఇతర ఆసియా దేశాలకు పంపుతున్నాయి. దీంతో సరుకు రవాణాకు సమయం, ఖర్చు భారీగా పెరగనున్నాయి.
ఫలితంగా ఆసియా దేశాల్లో చమురు ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం నెలకొంది. ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల కార్గో ధరలు రెట్టింపు కానున్నాయి. ఉదాహరణకు సూయజ్ కెనాల్ రూట్లో ఒక టీఈయూ(20 అడుగుల కంటైనర్) సరుకుల రవాణాకు రూ. 83 వేలు అవుతుందనుకుంటే.. ఆఫ్రికా చుట్టూ ఉన్న రూట్లో అయితే రూ. 1.66 లక్షలకుపైనే ఖర్చు కానుంది.