కొత్తగూడెంలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ల దాడి
కొత్తగూడెంలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ల దాడి
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు నిన్న కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేశారు. భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఎంతమాత్రమూ సహించబోదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతూ ఎక్స్ చేశారు.
డ్రైవర్‌పై ఎందుకు దాడిచేశారంటే...
బస్ కోసం వేచి చూసీచూసీ విసిగిపోయిన కొందరు ప్రయాణికులు ఇక లాభం లేదని ఆటోలు ఎక్కారు. అదే సమయంలో అక్కడకు బస్ రావడంతో వారంతా దిగిపోయి బస్ ఎక్కారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. ప్రయాణికులు, కండక్టర్ సరస్వతి ఎంత వారించినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి డ్రైవర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- తనను సీతక్క అనే పిలవాలని సూచించిన మంత్రి
తనను మేడమ్ అని పిలువవద్దని.. సీతక్క అని పిలవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆమె అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామినిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు మేడమ్ అంటూ పిలవడం ప్రారంభించారు. దీంతో స్పందించిన సీతక్క.. తనను మేడమ్ అని పిలువవద్దని... సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. 'మేడమ్ అంటే దూరం అవుతుంది.. ఇది గుర్తుంచుకోండి.. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా.. అక్కగా.. కలిసిపోతాం' అని వ్యాఖ్యానించారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని... విలువలు, మంచి పనులే మనకు శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదని.. గల్లీ బిడ్డల పాలన అని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు.. ఏం అవసరమున్నా మాతో చెప్పుకోవచ్చునని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా... ఆమె జామినిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.