ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు..టీడీపీ, బీజేపీ కలయికపై అనిశ్చితి
ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు..టీడీపీ, బీజేపీ కలయికపై అనిశ్చితి
ఏపీలో ఈసారి పొత్తు రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. వచ్చే ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్టు టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రకటించగా... జనసేన తమ భాగస్వామ్య పక్షం అని బీజేపీ చెబుతోంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ, బీజేపీ కూడా కలుస్తాయా అన్నది తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము జనసేనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో బీజేపీతో ఇతర పార్టీల పొత్తులపై జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు.
ఇక, వైసీపీ ప్రభుత్వంపైనా పురందేశ్వరి స్పందించారు. ఏపీలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ సర్కారు కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేంద్రం నిధులతోనే జరుగుతోందని పురందేశ్వరి స్పష్టం చేశారు. నిధులు కేంద్రానివి... స్టిక్కర్లు రాష్ట్రానివి అని వ్యాఖ్యానించారు.
ఈసారి ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఓటుతో దీవించాలని కోరారు. పురందేశ్వరి నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిశీలన అనంతరం బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.