ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ ప్రకాశ్ నగర్ వాసుల ఆరోపణ
ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ ప్రకాశ్ నగర్ వాసుల ఆరోపణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని, ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దానం, ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ప్రజావాణి సందర్భంగా బేగంపేట్ లోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. సిటీ నలుమూలల నుంచి, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామని వచ్చారు.