లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ

తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్‌స‌భ‌కు పోటీ చేయించాల‌ని కాంగ్రెస్ PAC తీర్మానం చేసింది. గాంధీ భ‌వ‌న్‌లో పీఏసీ చైర్మ‌న్ మాణిక్ రావు థాక్రే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీ. హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.   

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా పీఏసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో భాగంగా ప్ర‌ధానంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ, ఆరు గ్యారెంటీలు వంటి అంశాలపై చర్చించారు.

గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని షబ్బీర్‌ అలీ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దృష్టి సారించారని చెప్పారు. రాష్ట్రం పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని వివరించారు. 

అన్ని విషయాలను సంబంధిత మంత్రులు అసెంబ్లీలో బయటపెడతారని షబ్బీర్ అలీ చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 అమలవుతున్నాయని.. మిగతా 4 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై PACలో భట్టి విక్రమార్క వివరించారు. నాగ్ పూర్ సభకు 50 వేల మందిని తరలిస్తామని చెప్పారు.

ఫైనాన్స్ పై ఎల్లుండి(డిసెంబర్ 20) సభలో భట్టి ప్రకటన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి గ్రామసభలు ఉంటాయన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలోనే చేపడతామని వివరించారు.