దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల
దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల
దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం, కేరళలో కొత్త వేరియంట్కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ మన దేశంలో ఇప్పుడు బయటపడింది, ప్రస్తుతం 38 దేశాల్లో ఈ జేఎన్.1 సబ్ వేరియంట్కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. అయితే, రాబోయేది పండగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి క్రమాన్ని నిశితంగా పరిశీలించాలని, కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా కొత్త వేరియంట్‌పై ప్రజలలో అవగాహన పెంచాలని చెప్పారు. కాగా, కరోనా కేసులు సహా ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ నెల 20న వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.
కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసులు
కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1,828 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8న కేరళలో కొత్త వేరియంట్(జేఎన్.1) కేసు నమోదు కాగా.. ఆదివారం ఓ బాధితుడు మరణించాడని వివరించారు. అయితే, ఈ వేరియంట్ కేసులుభారత్ తో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించింది.