2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుంది..చంద్రబాబు
2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుంది..చంద్రబాబు
రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు.
ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు.
ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి మీరు ఏం ప్లాన్ చేయగలనని ప్రశంసించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని చెప్పారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.