సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు
సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.... విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితి రాకూడదని అన్నారు. అందుకే సీఎండీ బదులిస్తూ... ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని... సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందిస్తామని బలరాం తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాలలోనూ సింగరేణి ముందుండేలా చూస్తానని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తామన్నారు.
వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ పెట్రోల్ పంపులఅసోసియేషన్
హైదరాబాద్ లో ఇవాళ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాల క్యూలు ఉండడం తెలిసిందే. దాంతో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో... పెట్రోల్, డీజిల్ దొరకవేమోనన్న ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు.
ఈ నేపథ్యంలో, తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ శుభవార్త చెప్పింది. జనవరి 3 నుంచి పెట్రోల్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి వెల్లడించారు.
పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమ్మెకు దిగారని, దాంతో సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. ట్యాంకర్ల డ్రైవర్లతో మాట్లాడి, సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తలు అవాస్తవం అని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని, కొందరు కృత్రిమంగా పెట్రోల్ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని , వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అటు, కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న చట్టంలో 'హిట్ అండ్ రన్' క్లాజ్ కు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉండడంతో పలు చోట్ల పెట్రోల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
కొత్త చట్టం ప్రకారం... రోడ్లపై జరిగే ప్రమాదాల్లో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి... ఎవరినైనా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినా, ఆ ఘటనపై పోలీసులకు సమాచారం అందించకపోయినా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, 10 లక్షల జరిమానా పడే అవకాశాలుంటాయి. దీన్ని డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. కేవలం డ్రైవర్లనే బాధ్యులను చేసేలా కొత్త చట్టం ఉందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ట్రక్ డ్రైవర్ల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. సమస్య పరిష్కారం దిశగా సానుకూల రీతిలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.