వారం రోజులపాటు కాల్పులు ఆపేస్తామన్న ఇజ్రాయెల్
వారం రోజులపాటు కాల్పులు ఆపేస్తామన్న ఇజ్రాయెల్
హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుండడంతో వారం రోజులపాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ మేరకు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ గతంలోనూ ఓసారి సయోధ్య కుదిర్చి తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ను ఒప్పించింది.
ఈ నేపథ్యంలో హమాస్ చెరలో ఉన్న 40 మంది బందీలను విడిచిపెట్టే షరతుతో వారం రోజులపాటు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ఖతర్‌కు ఇజ్రాయెల్ చెప్పినట్టు సమాచారం. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిలో చిన్నారులు, మహిళలతోపాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా ఉన్నారు. కాల్పుల విరమణకు సిద్ధమైన ఇజ్రాయెల్ తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు కూడా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
యుద్ధాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేస్తేనే బందీల విడుదల సంగతి చూస్తామన్న హమాస్ డిమాండ్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించినట్టు సమాచారం. అయితే, తాము పూర్తిగా కాల్పుల విరమణ పాటించాలంటే మాత్రం అక్టోబర్ 7 నాటి మారణహోమానికి కారణమైన వారిని అప్పగించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ సరికొత్త ప్రతిపాదన చేసింది. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
అక్టోబరు 7 ఘటన తర్వాత రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ మిలటరీ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 52 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. కాగా, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. గాజా జనాభాలో 80 శాతానికిపైగా అంటే దాదాపు 1.9 మిలియన్ల మంది తరలిపోయారు.