మొత్తం 16 మంది సభ్యులతో చిదంబరం ఆధ్వర్యంలో 2024 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ
మొత్తం 16 మంది సభ్యులతో చిదంబరం ఆధ్వర్యంలో 2024 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో పోరుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ప్రకటించారు.
ఇందులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఖరారు చేసే ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, శశిథరూర్ లు కీలకంగా వ్యవహరించనున్నారు. ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, లోక్ సభలో పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాం గమ్ తదితరులు కూడా కమిటీలో ఉన్నారు.
- తెలంగాణలో పేదల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ అన్న
- రేవంత్ రెడ్డి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నాంపల్లి గ్రౌండ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో మత సామరస్యం పరిఢవిల్లాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కొన్ని పార్టీలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మణిపూర్ మంటల్లో కాలిపోతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మణిపూర్ ప్రజల ప్రాణాల కంటే బీజేపీకి ఓట్లే ముఖ్యమని మండిపడ్డారు.
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లి ప్రజల మధ్య వైషమ్యాలు తొలగించే ప్రయత్నాలు చేశారన్నారు. మణిపూర్ వంటి సంఘటనలు దేశంలో మరెక్కడా జరగకూడదన్నారు. తెలంగాణలో పేదల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని.. ప్రజల కోసం పని చేస్తున్నామన్నారు.