మరి కొన్ని నెలల్లో ఐపీఎల్-2024 సీజన్..దుబాయ్ లో వేలం కార్యక్రమం
మరి కొన్ని నెలల్లో ఐపీఎల్-2024 సీజన్..దుబాయ్ లో వేలం కార్యక్రమం
ఐపీఎల్-2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను రేపు (డిసెంబరు 19) దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ వేలం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 333 మంది ఆటగాళ్ల నుంచి తమకు కావాల్సిన వాళ్లను కొనుగోలు చేయనున్నాయి.
ఈసారి వేలంలో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇటీవల వరల్డ్ కప్ లో అందరి దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో మెరిసిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్, దక్షిణాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోట్జీ రేపటి వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరికి అత్యధిక ధర పలికే అవకాశాలున్నాయి.
ఆక్షనర్ గా మల్లికా సాగర్ వ్యవహరిస్తారు. మల్లికా సాగర్ ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలాన్ని నిర్వహించారు. ఐపీఎల్ వేలం ప్రక్రియను స్టార్ స్పోర్ట్స్ చానల్లోనూ, జియో సినిమా ఓటీటీ వేదికలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది.