బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా
బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా
బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము 'స్వేదపత్రం' విడుదల చేస్తామని నిన్న ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఇది రేపటికి వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేయనున్నారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఒకే కారులో ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లిన కేటీఆర్, హరీశ్ రావు
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా హాజరయ్యారు. వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో రాష్ట్రపతి నిలయంకు వెళ్లారు. కేటీఆర్ కారును డ్రైవ్ చేయగా, హరీశ్ రావు పక్క సీట్లో కూర్చున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి గవర్నర్ తిమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో, కేటీఆర్, హరీశ్ రావులు ఎమ్ హోం కార్యక్రమానికి వెళ్లారు. ఒకే కారులో బావబామ్మర్దులు వెళ్లిన ఫొటోను హరీశ్ రావు ట్విట్టర్ లో షేర్ చేశారు.