నయా మోసానికి తెరతీసిన నేరగాళ్లు...అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
నయా మోసానికి తెరతీసిన నేరగాళ్లు...అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగానే నేరగాళ్లు కూడా రాటుదేలిపోయారు. కొత్త పంథాలో నేరాలకు పాల్పడుతూ అమాయకులను నిలువుగా దోచుకుంటున్నారు. సంతానలేని సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలను గర్భవతులను చేస్తే రూ. 10 నుంచి రూ. 15 లక్షలు ఇస్తామంటూ వల విసురుతున్నారు. ఇదేదో బాగుందని ఎవరైనా ఆశపడితే ఇక అంతే సంగతులు.
తాము ఐశ్వర్యవంతులమే అయినా సంతానం లేని లోటు వేధిస్తోందని, కాబట్టే ఇలాంటి అభ్యర్థన చేయాల్సి వస్తోందంటూ పాచిక వేస్తారు. పొరపాటున ఎవరైనా ఆవేశపడితే ఉన్నదంతా ఊడ్చేస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఇలాంటి మోసాల బారినపడి బాధితులుగా మిగిలిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భార్యాభర్తలుగా నటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ఇలా అభ్యర్థిస్తే ఆవేశపడొద్దని, దానిని మోసంగా భావించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.